నీ రాక కోసం… ఇందూరు అనాథ లేఖ …
ఇందూర్ వార్త : నిజామాబాద్
ఇందూరు అనాథ… జిల్లా రాజకీయాలకు కవితను దూరం చేస్తున్న పరిస్థితులు… నాయకుల మధ్య సమన్వయానికి, ప్రజలకు ఆమే అండదండా… లిక్కర్ స్కాం పేరుతో కవితపై బీజేపీ వ్యూహాత్మక దాడి… జిల్లా నేతలకు, ప్రజలకు కవితకు మధ్య పెరుగుతున్న దూరం…
జిల్లా రాజకీయాలకు కవితను దూరం చేస్తున్న పరిస్థితులు…
నాయకుల మధ్య సమన్వయానికి, ప్రజలకు ఆమే అండదండా…
లిక్కర్ స్కాం పేరుతో కవితపై బీజేపీ వ్యూహాత్మక దాడి… జిల్లా నేతలకు, ప్రజలకు కవితకు మధ్య పెరుగుతున్న దూరం…
ఆత్మీయ సమ్మేళనాలకు, పార్టీ ప్లీనరీలకు రాని పరిస్థితులు…
కల్వకుంట్ల కవిత… ఇందూరు జిల్లాకు పెద్ద దిక్కుగా నిలిచారు. పార్టీని కంచుకోటలా మార్చారు. ఇక్కడ అన్ని నియోజకవర్గాలు బీఆరెస్ పార్టీ కైవసం చేసుకుందంటే ఉత్త మాటలు కాదు. దీని వెనుక నాయకుల ప్రమేయంతో పాటు కవిత సమన్వయం ఎంతో ఉంది. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు కదా. ఎంపీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత ఆమె జిల్లా రాజకీయాలకు దూరమవుతూ వచ్చారు. ఎంపీగా ఓడిన తర్వాత చాలా కాలం ఆమె నాయకులతో, ప్రజలతో కలవలేకపోయారు. ఘోర పరాభవం కింద పార్టీ ఈ ఓటమిని అంచనా వేసింది. ఈ పరిణామాలు ఆమెను కుంగదీశాయి. కానీ మళ్లీ ప్రజలకు చేరువ చేసేందుకు, పార్టీని పటిష్టం చేసేందుకు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత కూడా ఆమె అడపాదడపా వస్తున్నారు. క్రమంగా ఆమె జిల్లా పై మరింత పట్టు పెంచుకుని, పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలోనే బీజేపీ వ్యూహాత్మకంగా కవితను లిక్కర్ స్కాంలో ఇరికించడంతో ఆమె జిల్లాకు పూర్తిగా దూరంగానే ఉంటూ వస్తున్నారు.
అంతకు ముందు కనీసం హైదరాబాద్కు వెళ్లైనా ఆమెను కలిసి వచ్చేవారు. ఇప్పుడు ఆ అవకాశమూ లేకుండా పోయింది. కవితను బీజేపీ వెంటాడుతోంది. తద్వారా కేసీఆర్ను ఇరుకున పెట్టాలని చూస్తోంది. ఈ పరిణామాలను ప్రజలకు గమనిస్తున్నారు. ఓ వైపు ఎన్నికల సంవత్సరం… జిల్లాలో ఆమెను నమ్ముకుని ఉన్న చాలా మంది బీఆరెస్ కార్యకర్తలు, నాయకులకు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. పార్టీ శ్రేయోభిలాషులకు, కేసీఆర్ అభిమానులూ జీర్ణించుకోలేని పరిస్థితి.
ఆత్మీయ సమ్మేళనాలు ఎవరికి వారే చేసుకున్నారు. 25న జరిగే పార్టీ ప్లీనరీలు ఎవరికి వారే జరుపుకుంటున్నారు. ఆమె ఎక్కడికీ రాలేని పరిస్థితి. కాలు బెణకడంతో దాదాపు 20 రోజుల పాటు ఇంటికే పరిమితం కానున్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎప్పుడు కేంద్రం ఎలా విరుచుకుపడుతుందో తెలియని అయోమయ పరిస్థితుల నేపథ్యంలో.. కవిత జిల్లాకు ఎప్పుడొస్తారా ..? అనే ఎదురుచూపులు పెరుగుతున్నాయి. ఆమె రాకతో మళ్లీ పార్టీలో నూతనేత్తేజం వస్తుందని భావిస్తున్నారు. కనీసం ఓ ప్రకటన.. ఓ ట్వీట్ రూపంలోనైనా సందర్బానుసారం ఆమె సందేశాన్ని వెలువరచకపోవడం, జిల్లా రాజకీయాలకు పూర్తిగా దూరం దూరంగా ఉండటాన్ని వీరంతా ఏకాకి ఫీలవుతున్నారు.