-
అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయడం ఏంటన్న కోర్టు
-
అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం!
-
నిర్మాణాలను కూల్చివేసినందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచి రాబట్టాలని ఘాటు వ్యాఖ్య
-
వారి ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించాల్సి ఉంటుందన్న హైకోర్టు
- ఇందూర్ వార్త
- అక్రమమని తెలిసి కూడా అనుమతులు ఇచ్చి.. ఆ తర్వాత అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయడం ఏంటని తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటప్పుడు ఆ అనుమతులు ఇచ్చిన అధికారులే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల ఆస్తుల జప్తుకు ఆదేశించాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ మండలం నర్కుడ గ్రామంలోని మంగర్షి కుంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ జైస్వాల్‌తో పాటు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. అనుమతులు తీసుకుని నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారి ఈ నెల 4న గోడకు నోటీసులు అతికించినట్లు తెలిపారు. ఏడు రోజుల్లోగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొన్నారన్నారు. తమ నిర్మాణాల విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తామంటే ఎలాగని నిలదీశారు. ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీ అధికారులు జీఓ 168 ప్రకారం అనుమతులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. చెరువుల పరిరక్షణ కోసం అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన న్యాయమూర్తి.. అలాగని నిబంధనలను ఉల్లంఘించరాదని చెప్పారు. ఇరిగేషన్ అధికారులు జారీ చేసిన నోటీసులపై పిటిషనర్లు 15 రోజుల్లోగా అన్ని ఆధారాలు, పత్రాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఈలోగా నోటీసులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు.
Saturday, January 11
Trending
- హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి అడిషనల్ ఏ ఎస్పీ చైతన్య రెడ్డి
- గ్రామల అభివృద్ధికి పెద్దపీట మద్ది చంద్రకాంత్ రెడ్డి
- జై గౌడ ఉద్యమం క్యాలండర్ ఆవిష్కరించిన పిసిసి అధ్యక్షుడు
- ఎన్ సీసీ విద్యార్థులకు అండగా నిలిచిన అత్తుఇమామ్
- కళాశాలలు మరియు పాఠశాలల లో విద్యార్థులకు రహదారి భద్రత పై అవగాహన సదస్సులు నిర్వహించాలి – భూక్యా సురేష్ నాయక్
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన లింగారం తండా రైతులు
- రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్
- విద్యా హక్కు చట్టాన్ని ని ఉల్లంఘిస్తున్న గుడ్ న్యూస్ పాఠశాల యాజమాన్యం