*ప్రశ్నాపత్రాలతో దందా చేస్తున్న ప్రభుత్వం*
-టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం
టీఎస్పీఎస్సి ప్రశ్నాపత్రాలతో ప్రభుత్వం దందా చేస్తుందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ నెల 18 న ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద చేపట్టబోయే నిరుద్యోగుల గోస-అఖిలపక్ష భరోసా నిరసన దీక్ష కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని షబ్బీర్ అలీ నివాసంలో అఖిలపక్ష నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశామని, కేసీఆర్ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. ప్రభుత్వాన్ని వాడుకుని అడ్డగోలుగా సంపాధిస్తూ దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కమిషన్ల కోసమే ప్రాజెక్టులు డిజైన్ చేసారని, కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చడం కోసమే పనులు చేపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ చెప్పిందే వేదం.. గీసిందే గీత అన్నారు. ఉద్యోగం అనేది సామాజిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందని, ఉద్యోగం ఆత్మస్తైర్యాన్ని కలిగిస్తుందన్నారు. అనేక కష్టనష్టాలకోర్చి నిరుద్యోగులు పరీక్షలు రాస్తే ప్రభుత్వం ప్రశ్నాపత్రాలు అమ్ముకుని నిరుద్యోగులను ఆగం చేసిందన్నారు. ప్రశ్నాపత్రాలను అర్రాస్ చేసి అమ్ముకున్నారా లేక ప్రావీణ్యత ప్రదర్శిస్తారా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సి పరీక్షల్లో 100 కు పైగా మార్కులు వచ్చిన వాళ్లలో టీఎస్పీఎస్సి ఉద్యోగులు, వారి బంధువులే ఉన్నారన్నారు. విచారణకు ముందే లికేజీలో ఇద్దరికే ఉందని మంత్రి తీర్పు ఇచ్చారని, ఆ ఇద్దరు ఎవరెవరికి అమ్ముకున్నారు.. వారి వెనక ఉన్నదేవరో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. దానికోసం విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన విద్యార్ధులకు లక్ష పరిహారం అందించాలన్నారు. ప్రస్తుతం ఉన్న బోర్డు చైర్మన్ ఉంటే భవిష్యత్తులో ఇలాగే ప్రశ్నాపత్రాలు లీకేజీ జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నూతన బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలన్నారు. సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంబెడ్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, కేసీఆర్ రాసిన రాజ్యాంగం అమలవుతుందన్నారు. అందుకే పలుమార్లు రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి ఉత్తరాలు రాసిన పరిష్కారం లేదని, గవర్నర్ ను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, అందుకే కొట్లాడాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు. ఈ నెల 18 న జరిగే నిరసన దీక్ష విజయవంతం అయితేనే న్యాయం జరుగుతుందని, విద్యార్థులు, నిరుద్యోగులు ఈ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
*పేపర్ లికేజీ దొంగలను కాపాడే ప్రయత్నం చేశారు*
-మాజీ మంత్రి షబ్బీర్ అలీ
టీఎస్పీఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన దొంగలను మంత్రి కేటీఆర్ కాపాడే ప్రయత్నం చేసారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన టీఎస్పీఎస్సి పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. పేపర్ లీకేజీ ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీక్ పై కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా రేవంత్ రెడ్డితో కలిసి నిరసన దీక్ష చేపట్టామన్నారు. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పిదం మాత్రమే అని అసలైన దొంగలను కాపాడే ప్రయత్నం చేశారని తెలిపారు. పేపర్ లీకేజీ వెనక పెద్ద కుట్ర ఉందని, కమిషన్ చైర్మన్ బోర్డ్ సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని, షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ విచారణకు ముందే ఇద్దరు వ్యక్తులే పేపర్ లీకేజీ చేశారని ప్రకటించిన తర్వాత సిట్ కూడా అదే నివేదిక ఇస్తుందనో, నిజాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జితో కాని సిబీఐతో కాని విచారణ జరిపించాలన్నారు. ఈ నెల18 న తలపెట్టిన ఇందిరాచౌక్ వద్ద నిరుద్యోగ గోస-అఖిలపక్ష భరోసా నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జెఎసి కన్వీనర్ జగన్నాథం, టీజేఏసీ జిల్లా అధ్యక్షులు రమణ, టీచర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు వేణుగోపాల్, బీఎస్పీ నాయకులు బాలరాజు, విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.