*రిజర్వేషన్ కల్పించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం*
-ప్రభుత్వానికి కాయితి లంబాడీల హెచ్చరిక
కాయితి లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని కాయితి లంబాడీలు హెచ్చరించారు. కాయితి లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో పాటు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా సదశివనగర్ మండలం పద్మాజీవాడి చౌరస్టాలో సుమారు వెయ్యి మంది కాయితి లంబాడీలు 44 వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. సుమారు అరగంటకు పైగా రహదారిని దిగ్బంధించారు. దాంతో ఇరువైపులా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిఓ 2,4,5 అమలు చేయాలని, పొడు పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న వారిని విరమించేలా పోలీసులు శతవిధాల ప్రయత్నించినా వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా కాయితి లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ మాట్లాడుతూ.. తమకు 38 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేకనే రోడ్డుపైకి వచ్చామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడకముందు సీఎం కేసీఆర్ కాయితి లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని మేనిఫెస్టోలో చెప్పారని, అధికారంలోకి వచ్చాక కమిషన్ ఏర్పాటు చేసి కాలయాపన చేశారన్నారు. 1980 లో ఎస్టీ జాబితాలో ఉన్నప్పుడు రాజకీయ పదవులు పొందామని, ఉద్యోగాలు పొంది ప్రస్తుతం పదవి విరమణకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించినప్పుడు తాము కూడా ఎస్టీలుగా మారామని పాలభిషేకలు చేసి టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే 2,4,5 జిఓ అమలు చేయాలని, తమకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని, ఎస్టీలతో సమానంగా పొడు పట్టాలు అందించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేకపోతే ప్రాణాలు అర్పించైనా డిమాండ్లు సాధించుకుంటామని పేర్కొన్నారు. అవసరం అయితే అసెంబ్లీ ముట్టడిస్తామని, జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.