ఇందూర్ వార్త(వెబ్ న్యూస్):రాజంపేట
23 జూలై ఆదివారం,
అప్పులు చేసి కోళ్ల పెంపకాన్ని చేపడితే ఓ చికెన్ సెంటర్ యజమాని రైతుల దగ్గర కోళ్లను కొనుగోలు చేసి అందుకు సంబంధించిన డబ్బులు అడిగితే బెదిరింపులకు గురి చేశాడు. అంతేకాకుండా డబ్బులు అడిగితే చంపేస్తానంటూ కత్తితో వెంబడించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ సమీపంలో గల విన్ను చికెన్ సెంటర్ యజమాని శ్రీనివాస్ గత కొన్ని నెలలుగా కోళ్ల రైతుల వద్ద కోళ్లను కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన సుమారు 6 లక్షల రూపాయలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు.కోళ్ల రైతులు చికెన్ సెంటర్ వద్దకు వెళ్లి బకాయి డబ్బులు ఇవ్వాలని అడిగారు. దీంతో చికెన్ సెంటర్ యజమాని తమ్ముడు కత్తితో రైతులను బెదిరించాడు. దీంతో చికెన్ సెంటర్ ఎదుట రైతులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అంతేకాకుండా చికెన్ సెంటర్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. ఈ సందర్భంగా కోళ్ల పెంపకం రైతులు మాట్లాడుతూ గత 11 నెలలుగా రైతులకు సంబంధించిన బకాయి పడ్డ ఆరు లక్షల రూపాయలను విన్ను చికెన్ సెంటర్ యజమాని శ్రీనివాస్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుండా రైతులను చికెన్ సెంటర్ యజమాని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వను ఏమైనా చేసుకోండి అని బెదిరింపులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేసి బాకీ పడ్డ ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని రైతులు వేడుకున్నారు.