మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్
కామారెడ్డిలో కర్షకులు కదం తొక్కారు. మాస్టర్ ప్లాన్ వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. చౌరస్థాను దిగ్బంధించారు. ధర్నా, రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే, గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంటకు పైగా రైతులు ప్రధాన చౌరస్తాను దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ ముసాయిదా ఎవరిని అడిగి తయారు చేసారని నిలదీశారు. నాయకులు కొనుగోలు చేసిన భూముల్లో చేస్తున్న రియల్ వ్యాపారం లాభాల కోసమే మాస్టర్ ప్లాన్ రూపొందించారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ జోన్ లో పోతున్న తమ భూముల్లో కాయకష్టం చేసి పంట పండించుకుంటే జోన్ పేరుతో గద్దల్లా తన్నుకుపోతారా అని ప్రశ్నించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతును రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం అని నిలదీశారు. మా భూములను తీసుకునే హక్కు ఎవరిచ్చారన్నారు. ప్రస్తుతం వరినాట్లు వేసుకుని వ్యవసాయంలో బిజీగా ఉండే తాము తమ భూములు దక్కుతాయో లేదోనన్న భయంతో రోడ్లపైకి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల విషయమై నిన్న గంప గోవర్ధన్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే రైతు దినోత్సవం రోజునే రైతులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. వెంటనే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.