-
చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదు
-
కంపెనీల పేర్లను ఫిర్యాదులో ప్రస్తావించిన కామారెడ్డి ఎమ్మెల్యే
-
ప్రభుత్వం స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిక
ఇందూర్ వార్త
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైదరాబాద్‌లోని బుద్ద భవన్‌లో కలిశారు. చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న పలు కంపెనీలపై ఆయన ఫిర్యాదు చేశారు. ఆయా కంపెనీల పేర్లు ఏమిటో కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించి రెండు నెలల క్రితమే తాను మాట్లాడానని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. రెండు నెలల క్రితం తాను మాట్లాడానని, ఆ తర్వాత పది రోజులకు… అనుమతులు ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని గుర్తు చేశారు. కానీ చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తాను ఫిర్యాదు చేసిన ఐదు కంపెనీలకు అనుమతులు ఇచ్చిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం… గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఈ ఐదు సంస్థలకు సంబంధించి అనుమతులిచ్చిన అధికారులు, అండగా ఉన్న ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూఆక్రమణలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాల్సి ఉందన్నారు.