-
వైసీపీ హయాంలో మహిళలపై దారుణాలు జరిగాయంటూ అనిత ఫైర్
-
నిర్భయ చట్టాన్ని వదిలేసి దిశ చట్టాన్ని తీసుకొచ్చారని విమర్శ
-
సమాధానాలు చెప్పే ధైర్యం లేక వైసీపీ సభ్యులు పారిపోయారంటూ సెటైర్లు
ఏపీ శాసనమండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలపై హోంమంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని ఆమె అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తమపై కూడా కేసులు పెట్టారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో మహిళలపై లెక్కలేనన్ని దారుణాలు జరిగాయని చెప్పారు. దిశ చట్టం గురించి గొప్పగా చెప్పుకున్నారని… అసలు దిశ చట్టం ఉందా? అని ప్రశ్నించారు. ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి… లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. దిశ చట్టం సరిగా పని చేసి ఉంటే మహిళలపై దారుణాలు ఎందుకు జరిగేవని ప్రశ్నించారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు, అనితకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో అనిత మాట్లాడుతూ… వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై తాను మాట్లాడుతుంటే, వాటికి సమాధానం ఇచ్చే దమ్ము, ధైర్యం లేక సభ నుంచి పారిపోయారని అనిత సెటైర్లు వేశారు. అయితే, గౌరవ మంత్రి స్థానంలో ఉండి దమ్ము, ధైర్యం అనే పదాలు వాడటం సరికాదని మండలి ఛైర్మన్ వ్యాఖ్యానించడంతో… ఆమె క్షమాపణ చెప్పారు.