గ్రామాల్లో ఎన్నికల సందడి..
పాత రిజర్వేషన్లేనా..
ఆరు నెలలుగా ప్రత్యేక పాలన..
వార్డు మ్యాపింగ్, ఓటరు జాబితాపై శిక్షణ..
– కొన్నిచోట్ల తాజా మాజీసర్పంచ్లు
– మరికొన్నిచోట్ల అధికారపార్టీ శ్రేణులు
– ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు
– ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నాయకులు
– రిజర్వేషన్లపై అంతర్మథనం
ఇందూర్ వార్త : వెబ్ డెస్క్
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈపాటికే సర్పంచ్ ఎన్నికలు ముగిసి సర్పంచ్‌లు పాతబడేవారు. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆశావహులు ఎప్పుడెప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇంకా ఎన్నికలకు నెలలు పట్టే అవకాశం ఉండటంతో అప్పటిదాకా ప్రజల్లో ఉంటూ మద్దతు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. – బెజ్జూరు
జిల్లాలో 375గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటికి ఈ ఏడాది జనవరి31తో గడువు ముగియడంతో ఆరునెలలు ప్రత్యేకపాలన విధించారు. ఈ సమయం కూడా జూలైతో ముగియగా పొడిగింపు అనివార్యమైంది. ఆరునెలలు గడిచినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఎన్నికల కోసం ఎదురుచూసిన గ్రామ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో హల్చల్ చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము పోటీలో ఉంటామని సంకేతాలు ఇస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజల్లో పేరున్న తాజామాజీలు మళ్లీ ప్రజల మధ్య ఉంటుండగా, మరికొన్నిచోట్ల అఽధికార పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వం తనమదేనని తాముంటేనే పనులు అవుతాయని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో నలుగురు, ఐదుగురు ఆశావహులు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన సర్పంచ్‌లే 90శాతం నెగ్గారు. ప్రస్తుతం కాంగ్రేస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ సారి తమను ఆదరిస్తారని కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. దీంతో గ్రామాల్లో ఆశావహుల సందడి నెలకొంది.
ఆరు నెలలుగా ప్రత్యేక పాలన..
దాదాపు ఏడాదిగా పల్లెల్లో అభివృద్ధి కుంటుపడింది. వానాకాలం సీజనల్ రోగాలు ప్రభలకుండా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీల్లో నిఽధులు కరువయ్యాయి. కొత్తగా ఏర్పాటైన గిరిజన పంచాయతీల్లో అప్పట్లో ట్రాక్టర్ల రుణాల ఈఎంఐలు చెల్లించడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైనట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇంకా అనేక పంచాయతీ ఖాతాల్లో జమకాలేదని మాజీసర్పంచ్లు వాపోతున్నారు. మరోవైపు ప్రజలకు ప్రత్యేకాధి కారులు అందుబాటులో లేకపోవడం మూలంగా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుతం నియమితులైన ప్రత్యేకాధికారులు తమశాఖల పనులకే పరిమితమవుతూ సభులు, సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారని ఆరోనపనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంచాయతీఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలు స్తోంది.
వార్డు మ్యాపింగ్, ఓటరు జాబితాపై శిక్షణ..
సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం వార్డుల మ్యాపింగ్, ఓటరు జాబితా తయారుపై డాటా ఎంట్రీ ఆపరేటర్లకు అధికారులు శిక్షణ ఇచ్చారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పోలింగ్‌కు కొన్ని నెలల ముందే ఓటరు జాబితా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనకు జిల్లా నుంచి డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఎంపిక చేసి శిక్షణ ఇప్పించారు. ముందుగా వార్డుల మ్యాపింగ్, వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించే ప్రక్రియపై అవగాహన కల్పించారు. వీరు రూపొందించిన జాబితాను జిల్లా అధికారులు పరిశీలించి ఓటరు తుది జాబితాను వెల్లడిస్తారు.
పాత రిజర్వేషన్లేనా..
గత ప్రభుత్వం పంచాయతీల్లో రిజర్వేషన్ల గడువు పదిసంవత్సరాలు పెంచుతూ చట్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీకులగణన చేపట్టిన అనంతరం వాటి ఆధారంగా రిజర్వేషన్లలో మార్పులు తీసుకరావాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉండటం, సమయాభావం కారణంగా పాతరిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పల్లెల్లో ఎన్నికల సందడి..
జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో గ్రామపంచాయతీల ఎన్నికల సందడి నెలకొంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో అందరిచూపు సర్పంచ్ ఎన్నికలపై పడింది. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకోసం పనిచేసిన గ్రామస్థాయి నేతలు చాలామంది ఈసారి సర్పంచ్ లేదా, ఎంపీటీసీగా పోటీ చేయాలన్న ఉత్సాహంతో ఉన్నారు. ఓటర్లకు దగ్గరయ్యేందుకు వివిధ కార్యక్రమాలను చేస్తున్నారు. పండుగలు, వివిద ముఖ్యమైన రోజుల్లో గ్రామాల్లోనే ఉంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఇప్పటినుంచే ఎన్నికల సందడి మొదలైనట్లుగా కనిపిస్తోంది. జనాలు ఎక్కడ కలిసినా బాగున్నావా అంటూ పలకరింపులు మొదలు పెడుతున్నారు. ఎలాగైనా ఈసారి సర్పంచ్‌గా అవకాశం కల్పించాలని ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో అధికారులు ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితాను రూపకల్పన చేస్తున్నారు. ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లంతా ఒకే దగ్గరకు చేర్పించే పనిలో ఉన్నారు.