*నాడు తెలంగాణ కోసం.. నేడు బకాయిల కోసం బతుకమ్మ ఆట*
డ్వాక్రా మహిళా సంఘాలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు రెండవ రోజు తమ నిరసన కొనసాగించారు. నేడు మున్సిపల్ కార్యాలయం ముందు వందలాది మంది మహిళలు బతుకమ్మ ఆడి తమ నిరసన టలోయజేశారు. మున్సిపల్ కార్యాలయం ముందు ఒకవైపు రోడ్డు బ్లాక్ చేసి బతుకమ్మలను రోడ్డుపై ఉంచి మహిళలు ఆడుతూ పాడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మహిళలు మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు రావాల్సిన బకాయిల విడుదల కోసం రోడ్డెక్కి బతుకమ్మ ఆడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు తెలంగాణ ఉద్యమంలో నేటి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రోడ్డెక్కి బతుకమ్మలు ఆడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, నేడు అదే సీఎం కేసీఆర్ తమకు రావాల్సిన స్త్రినిది, వడ్డీలేని రుణాలు, అభయహస్తం నిధులు విడుదల చేయాలని బతుకమ్మ ఆడి నిరసన తెలిపే పరిస్థితి రావడం బాదాకారమన్నారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు 52 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇదే విధంగా నిరసనలు కొనసాగిస్తామన్నారు.