35 లక్షల మంది విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం..
వికారాబాద్ జిల్లాలో బియ్యం నాణ్యతను పరిశీలించిన
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్
దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోజు దాదాపు 35 లక్షల మంది విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు.
మంగళవారం నాడు వికారాబాద్ జిల్లా శివారెడ్డి పల్లిలోని మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్లో సన్నబియ్యం నాణ్యతను పరిశీలించారు. అనంతరం, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
బియ్యం నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 28,632 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం ద్వారా సుమారు 25 లక్షల మంది విద్యార్థులకు, అలాగే 4237 ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లోని 9 లక్షల 65 వేల మంది విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని ఇందుకోసం ఏడాదికి 1.50 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయిస్తున్నామని తెలిపారు. పౌరసరఫరాల సంస్థ ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని బియ్యం నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ భాస్కరరావు, మేనేజర్ అలివేలు మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.