కొత్తపేటలో ప్రొటోకాల్ రగడ…
ప్రజాపాలనలో ప్రహతీర్పు అపహాస్యం.
ఓడిన అభ్యర్థి వేదికపై ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే నేలపై
కొత్తపేటలో ప్రొటోకాల్‌కు తిలోదకాలుఅ
ధికారుల తీరుపై ఎమ్మెల్యే సబిత ఆగ్రహం
మాజీ ఎమ్మెల్యేలను ఆహ్వానించే చట్టం తీసుకురండి
స్టేజీ ముందు నేలపై బైఠాయించి నిరసన
బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల తోపులాట
ఇందూర్ వార్త : సంగారెడ్డి జూలై 16
ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం సహజం. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ప్రజాక్షేత్రంలో ఓడి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధంలేని వ్యక్తి అధికారిక స్టేజీ మీద కూర్చోవడమంటే? అది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే! ప్రజాతీర్పును అవహేళన చేయడమే! రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కొత్తపేటలో సోమవారం అదే జరిగింది. ఐదుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు మూడు పర్యాయాలు మంత్రిగా సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే అధికారిక స్టేజీ ముందు నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని మండిపడ్డారు.కొత్తపేట పరిధిలోని ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయ ఆవరణలో ఆషాడ మాస బోనాల దశాబ్ది ఉత్సవాల-2024 చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్‌రావు హాజరయ్యారు. అధికారులు వారిని స్టేజీ మీదకు ఆహ్వానిస్తూనే, కార్యక్రమంతో ఏమాత్రం సంబంధంలేని, ప్రధానంగా ప్రజాప్రతినిధికాని కాంగ్రెస్ నాయకుడు కే లక్ష్మారెడ్డిని స్టేజీ మీదకు ఆహ్వానించారు. దీనిపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో సంబంధంలేని వ్యక్తిని ఎలా స్టేజీ మీదకు ఆహ్వానిస్తారు? అని ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్‌రావుతో పాటు అధికారులను ప్రశ్నించారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు స్టేజీ మీదకు రావడంతో తోపులాట జరిగింది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అనంతరం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్టేజీ మీద నుంచి కిందకు వచ్చి నేలపై బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేనివిధంగా లబ్ధిదారులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెప్పడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు పదిహేను నిమిషాల పాటు అక్కడ నిరసన వ్యక్తం చేసిన ఆమె.. ఆ తర్వాత దేవాలయం బయటికి వచ్చి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మళ్లీ బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు.
మాజీ ఎమ్మెల్యేలను ఆహ్వానించే చట్టం తీసుకురండి –ఎమ్మెల్యే సబితారెడ్డి
ఈ వివాదం నేపథ్యంలో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలకు సబితారెడ్డి ధీటుగా సమాధానమిచ్చారు. ‘కేఎల్ఆర్ మాజీ ఎమ్మెల్యేనే కదా మేడం’ అనడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇక్కడ (మహేశ్వరం)మాజీ ఎమ్మెల్యే కాదు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే వేరే ఉన్నారు. అధికారిక కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యేలను పిలవడమనే చట్టం ఏమైనా ఉందా? రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలను పిలవండి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచే ఆ సంప్రదాయాన్ని ప్రారంభించండి. కొడంగల్‌లో కూడా మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. అధికారిక కార్యక్రమాలకు ఆయనను పిలవండి. ప్రొటోకాల్ అంశంలో మీరు (పోలీసులు) ఎందుకు మాట్లాడుతున్నారు? అంటూ మండిపడ్డారు. దీంతో ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.