సమాజ సేవలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
కామారెడ్డి పట్టణంలోని పి ఆర్ టి యు భవనంలో పి ఆర్ టి ఓ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని సూచించారు. అన్ని దానాల కన్న రక్త దానం మహోన్నతమైనదని తెలిపారు. సామల యాదగిరి జన్మదినాన్ని పురస్కరించుకొని 52వ పిఆర్టియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారని చెప్పారు. పి ఆర్ టి యు, రెడ్ క్రాస్ సొసైటీ సమన్వయంతో పనిచేసి ప్రతి ఏటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా పి ఆర్ టి యు అధ్యక్షుడు దామోదర్ రెడ్డి మాట్లాడారు. జిల్లాలో 50 మంది ఉపాధ్యాయులకు రెడ్ క్రాస్ జీవిత సభ్యత్వం ఇప్పిస్తామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సజావుగా సాగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మున్సిపల్ పరిధిలోని 13 గ్రామాల ఉపాధ్యాయులకు హెచ్ఆర్ఏ ఇప్పించడంలో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న మాట్లాడారు.8,9,10 తరగతుల విద్యార్థులకు జూనియర్ రెడ్ క్రాస్ సభ్యత్వం ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. సమావేశంలో జిల్లా పిఆర్టియు ప్రధాన కార్యదర్శి కుశాల్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి రఘు కుమార్, ప్రతినిధులు రమేష్ రెడ్డి, జమీల్ అహ్మద్, శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్, పోచయ్య, గాదరి రాజిరెడ్డి, ఈశ్వర్ కుమార్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ విజయలక్ష్మి, వైద్యుడు శ్రీనివాస్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.