సదరం కోసం తిప్పలు
— స్లాట్ దొరకాలంటే నెలలపాటు
— వెయిటింగ్ రిజక్ట్ అయితే మళ్లా బుకింగ్ అయితలే
— ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరం
ఇందూర్ వార్త నవంబర్ 13, కామారెడ్డి : జిల్లాలో సదరం సర్టిఫికెట్ కోసం స్లాట్ బుకింగ్ సమస్యగా మారుతోంది. స్లాట్ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఒకసారి రిజక్ట్ అయితే మళ్లీ బుక్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ కీలకం. గతంలో జిల్లా హస్పిటల్లో వారానికి ఒక సారి స్పెషల్ క్యాంపు నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేసేవాళ్లు. కానీ ఇటీవల ఆన్లైన్ బుకింగ్ తో స్లాట్స్ తీసుకొని క్యాంపునకు రావాలని రూల్ పెట్టారు. మీ సేవాలో స్లాట్ బుక్ చేసుకుంటే క్యాంపుకు రావాల్సిన డేట్ వస్తుంది. ఆ రోజునే దివ్యాంగులు జిల్లా హస్పిటల్‌కు రావాలి. అయితే వారానికి 50 స్లాట్లు మాత్రమే ఇస్తున్నారు. వందల మంది స్లాట్ల కోసం ట్రై చేస్తే కేవలం పది శాతం మందికే స్లాట్లు దొరుకుతున్నాయి. ఒక్కో మీ సేవాలో రెండు లేదా మూడుకు మించి రావటం లేదు. దీంతో వారాలు, నెలల తరబడి ప్రయత్నించినా స్లాట్ బుక్ కావటం లేదని దివ్యాంగులు ఆవేదన చెంతున్నారు. కొందరి దగ్గర రెండేళ్లు, మూడేళ్ల గడువుతో సర్టిఫికెట్లు ఉన్నాయి. ఆ గడువు ఆయిపోగానే పింఛన్ ఆగిపోతోంది. మళ్లీ సర్టిఫికెట్ తీసుకెళ్తేనే పింఛన్ అందుతుంది. గడువు ముగిసిన వారు కూడా స్లాట్ కోసం తిరుగుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరం
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సదరం శిబిరం నిర్వహించారు. దివ్యాంగులకు కేటాయించిన మీ సేవ స్లాట్లలో చాలావరకు స్లాట్లు బుక్ కాలేక చాలామంది ఈ శిబిరానికి రాలేకపోయారు. ప్రతి నెలలో జిల్లాలోని వికలాంగులకు వికలాంగత్వ నిర్ధారణ కొరకు ఏర్పాటు చేయబడు సదరం క్యాంపులో ఏ బి విభాగాలలో దివ్యాంగులకు స్లాట్ లు కేటాయించబడతాయి. దాని ప్రకారం దివ్యాంగులు మీసేవ కేంద్రాలలో సదరం టోకెన్ లు బుక్ చేసుకుని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని సదరం శిబిరానికి హాజరవుతారు. ఆర్థోపెడిక్ 112, విహెచ్ 20, ఈఎన్ టి 25, ఎం ఆర్ 15 స్లాట్ లను సోమవారం నుండి శనివారం వరకు టోకెన్ బుక్ చేసుకుని 13వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డిఆర్డిఏ కామారెడ్డి జిల్లా తరపున తెలిపారు. కానీ ఆర్థోపెడిక్ విభాగంలో 112 ,ఎం ఆర్ లో 15 స్లాట్ లో బుక్ అవ్వగా ఇఎన్‌టిలో ఒకటి ,విహెచ్ లో టోకెన్లు ఒక్కటి కూడా బుక్ కాలేవు. దీనివలన జిల్లాలోని దివ్యాంగులు చాలామంది సదర శిబిరానికి హాజరు కాలేకపోయారు. క్యాంపుకు హాజరైన దివ్యాంగులను డాక్టర్లు పరిశీలించారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్,ఈఎన్ టి సర్జన్ డాక్టర్ సంతోష్ కుమార్ , ఆఫ్తాల్మిక్ సర్జన్ డాక్టర్ కృష్ణ, ఇతర వైద్యుల ఆధ్వర్యంలో దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు.