*రైతుల జోలికొస్తే కేసీఆర్ ను బొంద పెడతాం*
-ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి
రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూసినా, రైతుల జోలికొచ్చినా కేసీఆర్ ను బొంద పెడతామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి హెచ్చరించారు. నలుగురి స్వలాభం కోసం 4 వేల మంది రైతులను రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు. ఆదివారం సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్ లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రైతులంటే కేసీఆర్ కు చులకనగా ఉందన్నారు. రైతులు తలుచుకుంటే కేసీఆర్ ను బొంద పెడతారని, దానికోసం రైతులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే రాష్ట్ర, దేశ స్థాయి బీజేపీ నాయకులు వచ్చి కామారెడ్డి గడ్డ మీద మాస్టర్ ప్లాన్ ఎత్తేసేవరకు పోరాటం చేస్తారని చెప్పారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.