కరీంనగర్: రేపు (మంగళవారం) దివ్యాంగులకు ఆటల పోటీలు
ఇందూర్ వార్త వెబ్ డెస్క్
మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 19న మంగళవారం దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి తెలిపారు. వచ్చే నెల 3న దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఈ ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనాలనుకునే దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తో 19వ తేదీ ఉదయం 9 గంటలకు కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియానికి హాజరుకావాలని సూచించారు. అక్కడే పేరు నమోదు చేసుకొని పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. 10 నుండి 17 సంవత్సరాల వారికి జూనియర్ విభాగంలో, 18 నుండి 54 సంవత్సరాల వారికి సీనియర్ విభాగంలో పోటీలు ఉంటాయని అన్నారు. చెస్, క్యారం, షాట్ పుట్, రన్నింగ్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాస్థాయి విజేతలకు రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం ఉంటుందని తెలిపారు. దివ్యాంగులు, దివ్యాంగ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.