కామారెడ్డి జిల్లా
ఇందూర్ వార్త : వెబ్ న్యూస్
రికార్డ్ లో చేసిన సంతకాన్ని విచారణ అధికారి వచ్చే సరికి సిఎల్ గా మార్చారు
కామారెడ్డి మునిసిపల్ పర్దిలోని దేవునిపాల్లీ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ఆఫీసుకు రాకుండానే రిజిస్టర్ లో వచ్చినట్టు సంతకాలు…
ఆ మెడికల్ ఆఫీసర్ నిత్యం దవాఖానకు రావాల్సి ఉంది. ప్రతిరోజు దవాఖానకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. కానీ ఆమె తన బాధ్యతను విస్మరించారు. విధులకు రాకున్నా వచ్చినట్టుగా రికార్డులో సంతకాలు చేశారు.. కాదు కాదు చేయించారు. గత కొద్దిరోజులుగా మెడికల్ ఆఫీసర్ విధులకు రావడం లేదని తెలుసుకున్న కొందరు జర్నలిస్టులు సాధారణ వ్యక్తుల మాదిరిగా ఆస్పత్రికి వెళ్లి నార్మల్ పరీక్షలు చేసుకొని వివరాలు సేకరించగా దొంగ సంతకాల భాగోతం బయటపడింది. ఇంకేముంది. ఆ మెడికల్ ఆఫీసర్ ను వదిలిపెట్టేలా మహామహులు రంగంలోకి దిగారు. ఆస్పత్రి చుట్టూ చక్కర్లు కొట్టారు. జర్నలిస్టులను బ్రతిమాలే పనిలో పడ్డా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి పిహెచ్ సి లో చోటుచేసుకుంది. సంబంధిత పిహెచ్ సీలో ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే గురువారం ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు విధులకు రాలేదు. అందులో రికార్డులో మొదటి పేరున్న ఓ మెడికల్ ఆఫీసర్ విధులకు రాకున్నా ఆమె వచ్చినట్టుగా సంతకం చేసేసారు. ఇది కాస్తా కొంతమంది జర్నలిస్టుల కంట పడింది. వెంటనే జిల్లా వైద్యాధికారి వివరణ కోసం సంప్రదించగా ఫోన్లో ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో సదరు జర్నలిస్టులు నేరుగా కలెక్టర్ కు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేయడంతో ఓ సీనియర్ అధికారిని పంపిస్తానని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ చంద్రశేఖర్ ను విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పిహెచ్ సికి పంపించారు. అయితే ఇక్కడే అసలు మతలబు మొదలైంది. మధ్యాహ్నం 1 గంటకు విచారణ అధికారి వచ్చేలోపు రికార్డులో చేసిన సంతకాన్ని కాస్తా సీఎల్(క్యాజువల్ లీవ్) గా మార్చేశారు. విచారణ నిమిత్తం వచ్చిన అధికారి మాత్రం రికార్డులో తారుమారైన సంతకాన్ని చూసిచూడనట్టు వదిలేశారు. అదే విషయాన్ని జర్నలిస్టులు గట్టిగా ప్రశ్నించగా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ ఆఫీసర్ నుంచి వివరణ కోరతామని వెల్లడించి వెళ్లిపోయారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ ను వివరణ కోరగా సదరు మెడికల్ ఆఫీసర్ కు మెమో జారీ చేస్తామని పేర్కొన్నారు.
బుధవారం సంతకం కూడా సీఎల్
గురువారం ఉదయం రికార్డులో బుధవారం రోజు కూడా సదరు మెడికల్ ఆఫీసర్ విధులకు వచ్చినట్టుగా సంతకం చేశారు. అయితే విచారణ జరిపేందుకు అధికారి వచ్చే లోపు సదరు మెడికల్ ఆఫీసర్ గురువారంతో పాటు బుధవారం కూడా సీఎల్ లో ఉన్నట్టుగా మార్చేశారు. ఒక మెడికల్ ఆఫీసర్ తన సంతకాన్ని గ్రీన్ పెన్నుతో చేస్తారు. ఇక్కడ కూడా ఆమె సంతకాన్ని గ్రీన్ పెన్నుతోనే చేసినా అదే గ్రీన్ పెన్నుతో చేసిన సంతకాన్ని సీఎల్ గా మార్చేశారు.
సంతకం ఫోర్జరీ చేసినట్టా..?
సదరు మెడికల్ ఆఫీసర్ విధులకు రాకున్నా వచ్చినట్టుగా సంతకం చేయడం దేవునిపల్లి పిహెచ్ సి వైద్యులకు మాత్రమే చెల్లింది. ఒకరి సంతకాన్ని ఇంకొకరు చేయడం అంటే మాములుగా ఫోర్జరీగా అభివర్ణిస్తారు. అయితే రాజకీయ పలుకుబడి ఉన్న ఆ మెడికల్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ కింద గుర్తిస్తారా లేక ఇతర కారణాలు చెప్పి వదిలేస్తారో చూడాలి. గత కొద్దిరోజులుగా సదరు మెడికల్ అధికారి ఇక్కడికి విధులకు రాకుండానే రిజిస్టర్ లో మాత్రం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ మెడికల్ ఆఫీసర్ సంతకాన్ని ఎవరు చేశారు. ఎందుకు చేశారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సంతకాలు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలుంటాయా లేక మనకెందుకులే అని వదిలేస్తారా తేలాల్సి ఉంది
సిసి ఫుటేజీ చూస్తారా..?
దేవునిపల్లి పిహెచ్ సి లో సిసి కెమెరా నిఘా ఉంది. సదరు మెడికల్ ఆఫీసర్ విధులకు హాజరవుతున్నారా లేదా హాజరైతే ఏ రోజు హాజరయ్యారు ఏ రోజు గైర్హాజరయ్యారు అనే వివరాలు పిహెచ్ సీలో ఉన్న సిసి కెమెరాలో నిక్షిప్తం అవుతాయి. అయితే అధికారులు సిసి ఫుటేజీ పరిశీలిస్తారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. నిష్పక్షపాత విచారణ జరిగితే మెడికల్ ఆఫీసర్ సంతకాల తతంగం మొత్తం బయటపడే అవకాశాలు ఉన్నాయి.