మహిళల పథకాలు తొలగించిన ప్రభుత్వం- కాటిపల్లి వెంకట రమణారెడ్డి
— 10 వ తారీకు నుండి ఆమరణ నిరాహార దీక్ష
– కాటిపల్లి వెంకట రమణారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చెందిన పథకాలన్నీ తొలగించిందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మరోమారు.. మహిళాపోరు కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీ అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గతంలో మహిళా సంఘాలలో అనేక రకాల పథకాలు ఉండేవని తెలిపారు. ఇందిర జలప్రబ, లాండ్ పర్చేస్ స్కీమ్, హెల్త్ అండ్ న్యూట్రషన్ స్కీమ్, పాల ప్రగతి కేంద్రాలు, ఆమ్ ఆద్మీ భీమ యోజన స్కీమ్, గుప్పెడు బియ్యం, బంగారు తల్లి, మహిళా సంఘాలకు భవనాలు, జీవిత భీమా, మహిళా ఆర్థిక అభివృద్ధి కోసం శిక్షణ, అభయ హస్తం ఇలా అనేక పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తి వేసిందన్నారు. వడ్డీ లేని రుణాలు, స్రీ నిధి రుణాలు కింద తీసుకున్న రుణాలపై ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉన్నా గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. తెలంగాణలో దాదాపు కోటి మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారనీ, లక్షకు పైగా మంది ఉద్యోగస్తులు ఉన్నారని తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో 2000 మంది బుక్ కిపర్స్ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మంది ఉన్నారన్నారు. సీఏ, వివోఎలు జిల్లాలో 680 ఉండగా, రాష్ట్రంలో 20 వేల మంది ఉన్నారని, సిసిలు జిల్లాలో 120 మంది ఉండగా రాష్ట్రంలో 2800 మంది ఉన్నారని, ఏపీఎంలు జిల్లాలో 22 మంది ఉండగా రాష్ట్రంలో 450 మంది ఉన్నారని, డిపిఎంలు జిల్లాలో నలుగురు ఉండగా రాష్ట్రంలో 150 మంది ఉన్నారని, జిల్లాకొక పిడి ఉండగా రాష్ట్రంలో 33 మంది ఉన్నారని, మెప్మాలు జిల్లాలో 3 ఉండగా, ఆర్పీలు 120 మంది ఉన్నారని, కామారెడ్డి పట్టణంలో 1830 సంఘాలు ఉండగా 20 వేల మంది మహిళలు ఉన్నారని, జిల్లా మొత్తం మున్సిపాలిటీలలో కలిపి 4 వేల సంఘాలు ఉంటే దాదాపు 45 వేల మంది మహిళలు ఉన్నారని కామారెడ్డి నియోజకవర్గంలో 7300 మహిళా సంఘాలు ఉన్నాయని లెక్కలు చెప్పారు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న మహిళా సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మహిళా సంఘాలకు సంబంధించిన అన్ని రకాల బకాయిల విషయం 2 రోజుల్లో తేల్చాలనీ లేకపోతే సోమవారం నుండి వేల మంది మహిళలతో నాలుగు రోజుల పాటు నిరాహార దీక్ష చేపడతామని,
అప్పటికి ప్రభుత్వం దిగి రాకపోతే 10 వ తారీకు నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.