భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. స్మితా సబర్వాల్‌కు రేవంత్ రెడ్డి ప్రమోషన్..!!
ఇందూర్ వార్త వెబ్ డెస్క్
పరిపాలనపై పట్టు సాధిస్తున్న క్రమంలో తెలంగాణలో అధికారుల బదిలీలు అనూహ్యంగా జరుగుతున్నాయి. వారాల వ్యవధిలోనే అధికారుల బదిలీలు జరుగుతుండడంతో పరిపాలన అస్తవ్యస్తంగా సాగుతోంది.తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ బదిలీల్లో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పదోన్నతి లభించడం గమనార్హం. ఈ బదిలీల్లో జీహెచ్ఎంసీ తాత్కాలిక కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇలంబర్తి పూర్తిస్థాయి కలెక్టర్‌గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.తెలంగాణ రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల్లో స్మితా సబర్వాల్‌తోపాటు అనితా రామచంద్రన్, ఇలంబర్తి వంటి అధికారులు ఉన్నారు. యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా స్మితను.. మహిళా, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్‌ను బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించగా.. దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఈ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణ్, ట్రాన్స్ కో సీఎండీగా డి కృష్ణ భాస్కర్‌ను నియమించింది. ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓగా శివశంకర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా సృజన, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఎస్ కృష్ణ ఆదిత్యను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
స్మితకు ప్రాధాన్యం
నాటి సీఎం కేసీఆర్ హయాంలో కీలక అధికారిణిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత కక్షపూరితంగా వ్యవహరించింది. ఉద్దేశపూర్వకంగా బదిలీల్లో అప్రాధాన్య పదవి ఇచ్చారు. ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా స్మితను బదిలీ చేసినా ఆమె ఎలాంటి అసంతృప్తి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే స్మిత కన్నా తక్కువ క్యాడర్ కలిగిన ఆమ్రపాలి కాటాకు అమిత ప్రాధాన్యం ఇచ్చారు. ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బదిలీ చేయగా.. ఇటీవల జరిగిన అనూహ్య పరిణామాలతో ఆమె ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. స్మిత పనితీనం.. ఆమె విలువ గుర్తించిన ప్రభుత్వం తాజాగా యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా స్మితను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.