–ఈటల తర్వాత పరిశీలనలో కామారెడ్డి ఎమ్మెల్యే పేరు
-కిషన్ రెడ్డి, బండి సంజయ్ నుంచి కేవీఆర్ కు ఫోన్
– ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కేవీఆర్
-అధ్యక్ష పదవి ఆఫర్ చేస్తే తీసుకునే యోచనలో కేవీఆర్..?
-ఎమ్మెల్యేగా వస్తారా..? అధ్యక్షుడిగా వస్తారా..?
-ఇద్దరు సీఎం అభ్యర్థులపై గెలిచిన ఫలితం
ఇందూర్ వార్త , ప్రతినిధి కామారెడ్డి :
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డికి బీజేపీలో అత్యున్నత స్థానం లభించనుందా..? బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో కాటిపల్లి ఉన్నారా..? ఈటల రాజేందర్ తర్వాత రాష్ట్ర అధ్యక్షునిగా కాటిపల్లి పేరే వినిపిస్తోందా..?అందుకే గత ఐదు రోజులుగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఢిల్లీలో మకాం వేశారా..? ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం వినిపిస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలపై గెలవడం కాటిపల్లికి కలిసొచ్చిందన్న ప్రచారం సాగుతోంది. ఇద్దరు సీఎం అభ్యర్థులపై గెలిచిన వ్యక్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు రావడంతో పాటు ఎంపీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు పోలవడంతో పార్టీ అధిష్టానం కాటిపల్లి పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి పరిశీలనకు తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. గత ఐదు రోజులుగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఢిల్లీలోనే మకాం వేయడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.
గతంలో బీజేపీఎల్పీ లీడర్ అంటూ ప్రచారం
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ఇద్దరు సీఎం అభ్యర్ధులపై గెలవడంతో ఎక్కడికి వెళ్లినా ఆయనను ప్రత్యేకంగా గుర్తించారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికల్లో ఆయనతో పార్టీ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడానికి బాధ్యత అప్పగించింది. అసెంబ్లీ సెషన్స్ సమయంలో బీజేపీఎల్పీ లీడర్ గా కాటిపల్లికి అవకాశం వస్తుందట అంటూ గట్టిగా ప్రచారం కూడా సాగింది. కానీ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే యేలేటి మహేశ్వర్ రెడ్డికి పార్టీ అవకాశం కల్పించింది. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం వస్తుందంటూ కాటిపల్లి పేరు అనేకమార్లు వినిపించింది. కొంతకాలంగా ఆ ప్రచారం సద్దుమనిగినా ప్రస్తుతం ఆ ప్రచారం మళ్ళీ ఊపందుకుంది.
ఈటల తర్వాత కేవీఆర్ పేరు
ఇప్పటివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిలకు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కడంతో కొత్త అధ్యక్షుని నియామకంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ప్రప్రథమంగా దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గ మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ వస్తుంది. ఈటల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాయం అనుకున్న క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ క్రమంలో మళ్లీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి రాని పక్షంలో కేవీఆర్ కు అధ్యక్ష పదవి ఖాయమంటూ కామారెడ్డి నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో కేవీఆర్ పేరు గట్టిగా వినిపిస్తుండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది.
ఐదు రోజులుగా ఢిల్లీలోనే కేవీఆర్
ఈ ప్రచారం నేపథ్యంలో ఎమ్మెల్యే కేవీఆర్ గత ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయడం అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేవీఆర్ కు ఫోన్ చేసి ఢిల్లీ రావాల్సిందిగా చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది. ఇద్దరు మంత్రుల సూచనతోనే కేవీఆర్ ఢిల్లీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఎంపీల ప్రమాణస్వీకరానికి వెళ్లినట్టుగా ప్రచారం సాగుతున్నా బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో చర్చించడానికే ఢిల్లీకి పయణమయ్యారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో బీజేపీఎల్పీ నేతగా అవకాశం రాకపోవడంతో బీజేపీ అధ్యక్ష పదవి పక్కా అనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ అధిష్టానం అధ్యక్ష పదవి కట్టబెడితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే యోచనలో కేవీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కేవీఆర్ కు ఎంపీ ఈటల రాజేందర్ తో మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఆయనను కాదని అధ్యక్ష పదవి తీసుకుంటే ఈటల నొచ్చుకుంటారేమోనని కేవీఆర్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అధ్యక్ష పదవి ఈటల తీసుకోని పక్షంలోనే కేవీఆర్ ముందుకు వెళ్లవచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది
ఎమ్మెల్యేగా వస్తారా..? అధ్యక్షుడిగా వస్తారా..?
ఐదు రోజులుగా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఢిల్లీలో ఉండటం, బీజేపీ అధ్యక్షునిగా పేరు మారుమోగుతుండటంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ క్రమంలో కేవీఆర్ కామారెడ్డికి తిరిగి వస్తే కామారెడ్డి ఎమ్మెల్యే హోదాలోనే వస్తారా లేక రాష్ట్ర అధ్యక్ష హోదాలో వస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కామారెడ్డి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన కేవీఆర్ పేరు రాష్ట్ర అధ్యక్ష పదవి రేసు వరకు వెళ్లడం అంత ఆషామాషీ కాదన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఓ సందర్భంలో తనకు సీఎం అవ్వాలన్న ఆశ కూడా ఉందని ఏదో ఒకరోజు సీఎం అవుతానని కూడా మీడియా ముఖంగా ఎలాంటి సంకోచం లేకుండా చెప్పడాన్ని ప్రస్తుతం కొందరు గుర్తు చేసుకుంటున్నారు. పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి భవిష్యత్తులో సీఎం అవుతా అని చెప్పడం అంత ఈజీ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరొక నాలుగైదు రోజులు వేచి చూడాల్సిందేనని తెలుస్తోంది.