పూణెలో కుప్పకూలిన హెలికాప్టర్.. అక్కడిక్కడే ముగ్గురు దుర్మరణం
ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ ,అక్టోబర్ 02
ఇందూర్ వార్త , హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన మహారాష్ట్ర లోని పూణె జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.సమీపంలోని గోల్ఫ్ కోర్స్ వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ముగ్గురు వ్యక్తులతో బయలుదేరింది. ఈ క్రమంలో చాపర్ బవ్ధాన్ ప్రాంతంలోని కొండ ప్రాంతం వద్దకు రాగానే సరిగ్గా ఉదయం 6.45కు కుప్పకూలింది. అనంతరంలో హెలికాప్టర్లో భారీగా మంటలు చెలరేగడంతో పైలెట్తో సహా ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అయితే, అది ప్రభుత్వ హెలికాప్టరా లేక ప్రైవేటుదా అనే విషయం తెలియాల్సి ఉంది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న హింజేవాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ కన్హయ్య థోరట్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హెలికాప్టర్ నుంచి వస్తున్న మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆయన పూణే మునిసిపల్ కార్పొరేషన్ , పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సమాచారం అందజేశాడు. మొత్తం నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మృతదేహాలను వెలికితీసే పనిలో పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు.