పల్వంచ నూతన మండల కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి, మే 22: ఇందూర్ వార్త
పల్వాంచ మండలం రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ , కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పల్వంచ రైతు వేదిక లో నూతన మండల ఏర్పాటులో భాగంగా సోమవారం మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుదేశించి మాట్లాడారు. పరిపాలన ప్రజల ముందు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని తెలిపారు. పోరాడి తీసుకువచ్చిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చేపట్టడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు. పాల్వంచ మండలంలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కారం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏడు ఎంపీటీసీ స్థానాలతో కొత్త మండలం పల్వంచ ఏర్పాటు అయిందని పేర్కొన్నారు. మండలం ఏర్పాటైన సందర్భంగా మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. మండలాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబొద్దిన్, ఎంపీపీ నర్సింగ్ రావు, జెడ్పిటిసి సభ్యుడు రామ్ రెడ్డి, సర్పంచ్ సునీత, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో బాలకృష్ణ, తాసిల్దారులు సాయిలు, సునీత, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.