INDURVAARTHA KAMAREDDY
దొడ్డి కొమురయ్య జయంతి, వర్థంతిలను గ్రామగ్రామాన నిర్వహించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు, గొర్లు, మేకలు సంఘం ఫెడరేషన్ చైర్మన్ మర్కంటి భూమన్న ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం దొడ్డి కొమురయ్య వర్థంతి సందర్బంగా కలెక్టరేట్ లో కురుమ సంఘం ఆధ్వర్యంలో కొమురయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రజాసంఘాల నాయకులు, కురుమసంఘం నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మర్కంటి భూమన్న మాట్లాడుతూ.. నిన్న సాయంత్రం వరకు దొడ్డి కొమురయ్య వర్థంతి వేడుకలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు. ప్రభుత్వం రెండు రోజుల ముందుగానే ప్రకటిస్తే సుమారు వెయ్యి మందితో వేడుకలు ఘనంగా నిర్వహించుకునే అవకాశం ఉండదన్నారు. గొల్ల కురుమలకు ఉపాధి నిమిత్తం ప్రభుత్వం గొర్లను సబ్సిడీ కింద ఇస్తుందని, అలాగే సబ్సిడీ కింద షెడ్ నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించాలని కోరారు. వచ్చే జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తే మున్సిపల్ వద్ద ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం ఉపాధ్యక్షుడు చంద్రం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుచ్చన్న, తాడ్వాయి మండల అధ్యక్షుడు గంగన్న, యూత్ అధ్యక్షుడు సంజీవ్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు