జమిలి ఎన్నికలపై కేటీఆర్ అనుమానాలు
వచ్చే ఎన్నికల్లో అన్ని ప్రభుత్వాలు రద్దు చేస్తారా అని అనుమానం
పూర్తి క్లారిటీ ఇవ్వాలని డిమాండ్
ఇందూర్ వార్త : వెబ్ డెస్క్ సెప్టెంబర్ 19
దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చేసారి నుంచే జమిలి ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించటం.. ఇప్పుడు దేశమంతా హాట్ టాపిక్‌గా మారింది. ఈనేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జమిలి ఎన్నికల గురించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వచ్చేసారి నుంచి జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. దేశంలోని అన్ని ప్రభుత్వాలను రద్దు చేస్తారా అని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. జమిలి ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ నేతలమంతా కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు.
మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సర్కారు.. బలహీన వర్గాలను మోసం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. బుధవారం కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలోని బీసీ నాయకులతో సమావేశమయ్యారు.
బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపై బీఆర్ఎస్ బీసీ నేతలతో చర్చించినట్టు కేటీఆర్ తెలిపారు. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసే వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయటంతో పాటు.. సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నవంబర్ 10వ తేదీలోపు సమగ్ర కులగణన పూర్తి చేయని పక్షంలో బీసీల తరఫున ఎలా ముందుకు వెళ్లాలో కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు.
అవరసరమైతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని కేటీఆర్ తెలిపారు. బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి.. కేవలం 8 వేల కోట్ల నిధులు మాత్రమే బడ్జెట్లో కేటాయించారని తెలిపారు. బీసీ సబ్ ప్లాన్ పెట్టాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. 25 నుంచి 35 వేల కోట్లు అందులో పెట్టాలన్నారు. ఎమ్మెల్సీ మధుసూదనా చారి నేతృత్వంలో తమిళనాడు వెళ్లి.. అక్కడ బీసీల కోసం అమలు చేస్తున్న పథకాలపై అధ్యయనం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం ఇద్దరు బీసీ మంత్రులు మాత్రమే కేబినెట్లో ఉన్నారని గుర్తు చేసిన కేటీఆర్.. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.