*కాంగ్రెస్ పార్టీలో మహిళలకు విలువ లేదు*
-పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్టిపి నాయకురాలు జమునా రాథోడ్ హాట్ కామెంట్స్
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్టిపిలో చేరిన ఎల్లారెడ్డి నియోజకవర్గ నాయకురాలు జమునా రాథోడ్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లేదన్నారు. మహిళలకైతే అస్సలు విలువ లేదన్నారు. ఆ పార్టీ అగ్రవర్ణాల పార్టీ అని ఫైర్ అయ్యారు. గత సోమవారం వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్టిపి చీఫ్ షర్మిల సమక్షంలో పార్టీలో చేరిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు జమునా రాథోడ్ నేడు జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్టిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. షర్మిలను మర్యాదపూర్వకంగా కలవాలని ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో వరంగల్ వెళ్ళానని, ఎల్లారెడ్డి నియోజకవర్గ సమస్యలు ఆమెకు వివరించగా ఒక మహిళగా తనకు తోడుగా పార్టీలో చేరాలని షర్మిల కొరారన్నారు. కార్యకర్తలకు ఎలాంటి సమాచారం లేకుండానే అనుకోకుండా వైఎస్ఆర్టిపిలో చేరినా తనను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులు అండగా నిలిచారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జీరో స్థాయిలో ఉన్న సమయంలో తన పాదయాత్రతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీకి జీవం పోసారన్నారు. గరీబి హఠావో అనే నినాదంతో ఇందిరాగాంధీ పార్టీ స్థాపించారని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి గరీబోళ్లను హఠాయిస్తున్నారని ఆరోపించారు. పార్టీలో ఎస్సి, ఎస్టీ, బిసిలకు మహిళలకు ఎలాంటి స్థానం లేకుండా చేస్తున్నారన్నారు.
*రేవంత్ రెడ్డి ఎవరిని కలవరు*
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక ఎవ్వరిని లెక్కలోకి తీసుకోవడం లేదని జమునా రాథోడ్ ఆరోపించారు. ఎవరికి గౌరవం ఇవ్వరని, కలవడానికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని తెలిపారు. హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర మొదలు పెట్టారన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని, ఆయనకు పార్టీలో సఖ్యత లేదన్నారు. పార్టీలో ఐక్యత కరువైందని, చేయి చేయి కలిపే పరిస్థితి లేదని చెప్పారు. నేడు ప్రజలను కలుపుకుని పోవాలని రేవంత్ రెడ్డి నడుస్తున్నారని, ఆయనతో కలిసి ఎంతమంది నడుస్తున్నారని, ఎవరు సపోర్ట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవి తప్ప రేవంత్ రెడ్డి వెనక ఎవరు కనిపిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తారని, ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారని ప్రశ్నించారు.
*షర్మిలతోనే వైఎస్ఆర్ పథకాలు*
దివంగత నేత వైఎస్ఆర్ చేపట్టిన పథకాలు ప్రజల గుండెల్లో నిలిచాయని జమునా రాథోడ్ తెలిపారు. ఆ పథకాలు మళ్ళీ పునరుద్ధరించాలంటే కేవలం వైఎస్ఆర్ తనయ షర్మిలతోనే సాధ్యమన్నారు. వైఎస్ షర్మిల చరిత్ర సృష్టించగలిగే పాదయాత్ర చేపట్టిందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు కష్టపడినా సముచిత స్థానం లభించదని అర్థమైందన్నారు. ఆందుకే ఆత్మస్తైర్యంతో ముందుకు వెళ్తున్న షర్మిలతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.
*రాష్ట్రమంతటా గ్రూపు రాజకీయాలు*
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాల వల్లనే పార్టీ మారారా అని విలేకరులు ప్రశ్నించగా కేవలం ఎల్లారెడ్డిలో మాత్రమే కాదని, రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని తెలిపారు. హై కమాండ్ నుంచి చూస్తే ఢిల్లీలో ఎవరు మాట వింటున్నారన్నారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్లే పార్టీ అధ్యక్ష పదవి తీసుకోలేదని, ఆయన పార్టీని ఆయనే గౌరవించుకోలేక పోతున్నారని, నాయకులకు నమ్మకం కలిగించలేకపోతున్నారని విమర్శించారు. దాంతో కిందిస్తాయిలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయని తెలిపారు. ఫలితంగా ప్రజలకు పార్టీపై నమ్మకం లేకుండా పోతుందన్నారు
*ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించలేదు*
ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఇవ్వకపోవడం వల్లనే వైఎస్ ఆర్టిఫిలో చేరారని, ఎమ్మెల్యే టికెట్ ఆశించే వైఎస్ఆర్టిపిలోకి చేరారా అని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు. టికెట్ ఆశించి వచ్చేదాన్ని అయితే 14 సంవత్సరాలుగా పార్టీలో ఉన్న తనను కాదని తర్వాత వచ్చిన జాజాల సురేందర్ కు టికెట్ ఇచ్చారన్నారు. తనకు టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా పార్టీని వదిలిపెట్టలేదన్నారు. ఒక్క రూపాయి కూడా ఎవరినుంచి ఆశించలేదని పేర్కొన్నారు. తన సొంత డబ్బులతో ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశానని, ప్రజల కష్టసుఖల్లో పాలు పంచుకున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి, వైఎస్ షర్మిల నాయకత్వంలో పనిచేయడానికి తాను పార్టీలో చేరానని తెలిపారు. భవిష్యత్తులో వైఎస్ ఆర్టిపి గెలుపు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్టిపి జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్, కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి నీలం రమేష్, మహ్మద్ తాహెర్, నాయకులు వెంకట్, తదితరులు పాల్గొన్నారు.