*ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ కు భారీ షాక్*
-వైఎస్ఆర్టిపిలో చేరిన పార్టీ ముఖ్య నాయకురాలు జమునా రాథోడ్
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీలో ముఖ్య నాయకురాలుగా కొనసాగుతున్న జమునా రాథోడ్, వెంకట్ లు వైఎస్ షర్మిల సమక్షంలో వైఎస్ఆర్టిపిలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ తనకంటూ ఓ క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్న జమునా రాథోడ్ ఒక్కసారిగా పార్టీ మారడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత కొద్దికాలంగా జమునా రాథోడ్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ మారడం ఖాయమని ప్రచారం సాగింది. అవన్నీ కొట్టిపారేస్తూ పార్టీ బలోపేతం కోసం ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దాంతో పార్టీ మార్పుపై కొద్దిరోజులుగా సైలెన్స్ అయింది.
*విబేధాలే కారణమా..?*
ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో మూడు ముక్కలాట సాగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. దానికి ఆజ్యం పోస్తూ పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారుగానే నిర్వహిస్తూ వస్తున్నారు. కిందిస్థాయి కార్యకర్తలు ఎవరికి మద్దతు పలకాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు. ఈ క్రమంలో జమునా రాథోడ్ పార్టీ మార్పు విషయంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, టీపీసీసీ ఐటి సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు ఎవరికి వారే అన్నట్టుగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. దాంతో పార్టీలో విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి ఎల్లారెడ్డి నియోజకవర్గ విభేదాల అంశం చేరినట్టుగా తెలుస్తోంది. ఆ విబేధాలతోనే జమునా రాథోడ్ పార్టీ మారినట్టుగా ప్రచారం సాగుతోంది. ఎల్లారెడ్డిలో జరిగిన రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పార్టీలో ఉన్న విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దాంతో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టినా మార్పు రాలేదని తెలుస్తోంది.
*అసెంబ్లీ టికెట్ కోసం పోటీ*
రాబోయే ఎన్నికల్లో ఎల్లారెడ్డి సెగ్మెంట్ జిల్లాలో కీలకంగా మారనుంది. గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకోగా ఒక్క ఎల్లారెడ్డి మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో పడింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన జాజాల సురేందర్ నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అధికార పార్టీలో చేరారు. దాంతో ఆయన డబ్బులకు అమ్ముడుపోయారని ప్రచారం సాగింది. తర్వాత పరిణామాలు పార్టీకి క్లిష్టంగా మారాయి. జాజాల సురేందర్ తర్వాత స్థానంలో ఉన్న వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పార్టీ టికెట్ కోసం ఆశిస్తున్నారు. గతంలో జహీరాబాద్ పార్లమెంటుకు పోటీ చేసి అత్యల్ప మెజారిటీతో ఓటమి పాలైన మదన్ మోహన్ రావు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే తనకు కూడా అవకాశం లభిస్తుందన్న ఆశతో జమునా రాథోడ్ సైతం టికెట్ పై ఆశ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తనకు టికెట్ వస్తుందన్న నమ్మకం లేకపోవడంతోనే జమునా రాథోడ్ పార్టీ మారినట్టు చెప్పుకుంటున్నారు.
*బిఎస్పీలో చేరుతారని ప్రచారం*
తెలంగాణలో బిఎస్పీకి గతంలో ఓటు బ్యాంకు అంతగా ఉండేది కాదు. ఆర్.ఎస్ ప్రవీణ్ బిఎస్పీలో చేరి, పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన రాష్ట్రంలో నిరంతరం పర్యటిస్తూ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్.ఎస్ ప్రవీణ్ బీఎస్పీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జమునా రాథోడ్ బిఎస్పీలో చేరుతున్నారని, త్వరలో ఎల్లారెడ్డిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో బీఎస్పీ తీర్థం పుచ్చుకుంటారని అప్పట్లో జోరుగా చర్చ సాగింది. దాంతో తాను ఎవరితో సంప్రదింపులు జరపలేదని, ఏ పార్టీలో చేరడం లేదని జమునా రాథోడ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
*షర్మిలతో భార్యాభర్తల భేటి*
తాజాగా కాంగ్రెస్ పార్టీలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయయని భావించిన జమునా రాథోడ్ వైఎస్ఆర్టిపి నాయకులతో సంప్రదింపులు జరుపుతూ పార్టీలో చేరడానికి మార్గం సులువు చేసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలతో భార్యాభర్తలిద్దరూ భేటి అయిన తర్వాత నేడు షర్మిల సమక్షంలో వైఎస్ఆర్టిఫిలో చేరినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే పార్టీలో చేరగా త్వరలో భారీ ఎత్తున కాంగ్రెస్ నుంచి వైఎస్ ఆర్టిపిలోకి కార్యకర్తలు చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొద్దిరోజుల్లో నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడి ఎల్లారెడ్డిలో సభ నిర్వహించి ఆ సభలోనే జమునా రాథోడ్ తన క్యాడర్ ను వైఎస్ఆర్టిఫిలో చేర్చడానికి ప్రణాళిక వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కార్యకర్తలు మాత్రమే పార్టీ మారతారా.. లేక ఇంకా ఎవరైనా ముఖ్య నేతలు చేరతారా అనేది ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది.